చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ శుక్రవారం సుమారు మూడు గంటల పాటు సమావేశం అయ్యారు. అంతకు ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో వాంగ్ యి సమావేశం అయ్యారు.
సమావేశం అనంతరం కేంద్ర మంత్రి జయశంకర్ మాట్లాడుతూ.. భారత్- చైనా మధ్య సంబంధాలను ఉద్దేశించి మాట్లాడుతూ పనులు పురోగతిలో ఉన్నాయి(వర్క్ ఇన్ ప్రోగ్రెస్)అని అన్నారు.
కానీ ఈ పురోగతి మనం కోరుకున్న దాని కన్నా చాలా నెమ్మదిగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణంగా లేవన్నారు.
‘ ఏప్రిల్ 2020 నుండి చైనీస్ బలగాల మోహరింపుల వల్ల పెరుగుతున్న ఘర్షణలు, ఉద్రిక్తతలు ప్రస్తుతం సాధారణ సంబంధాలతో పునరుద్ధరించలేము’ అని తెలిపారు.
‘ ఈరోజు మన సంబంధాలు మాములుగా ఉన్నాయా? అని మీరు నన్ను అడిగితే, నా సమాధానం ‘లేదు, అవి సాధారణంగా లేవు అని చెబుతాను. ఈ రోజు మన ప్రయత్నం పూర్తిగా సమస్యను పరిష్కరించడమే ‘ అని ఆయన అన్నారు.
సరిహద్దు వద్ద చైనా చర్యలతో ఇరు దేశాల మధ్య చెదిరిన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగాయని చెప్పారు. సరిహద్దులో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగిన పరిస్థితి ఉందన్నారు.
లడఖ్‌లో, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయని, ఇతర ప్రాంతాల్లో పురోగతి’ ఉందని విదేశాంగ మంత్రి అన్నారు. దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదే ఈరోజు తమ చర్చ అని అన్నారు.
యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు చేయకూడదు.
పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ఆసక్తితో సంబంధం అనే మూడు అంశాలపై పరస్పరం ఇరు దేశాల సంబంధం ఆధారపడిందని జయశంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపైన చర్చించారు.