కెనడాలో బ్రాంప్టన్ నగరంలోని ‘శ్రీభగవద్గీత’ పార్క్ వద్ద గల సైన్ బోర్డును ధ్వంసం చేసినట్టు వచ్చిన వార్తలను పోలీసులు తోసిపుచ్చారు. దీన్ని నాశనం చేశారనడానికి ఆధారాలు లేవని వారు చెప్పారు. అక్కడ ఎలాంటి హేట్ క్రైమ్ జరగలేదన్నారు.శాశ్వత సైన్ బోర్డు మీద పూర్తిగా అక్షరాలను రాయవలసి ఉందని, అంతవరకు తాత్కాలికంగా ఈ బోర్డు ఉందని వారు చెప్పారు. పైగా పార్క్ స్ట్రక్చర్ కి కూడా ఎలాంటి హానీ కలగలేదన్నారు. ఈ మేరకు పీల్ రీజనల్ పోలీసులు ట్వీట్ చేశారు.
ఇటీవలే ఈ పార్కును ‘శ్రీభగవద్గీత’ పార్కుగా నగర మున్సిపల్ కార్పొరేషన్ పేరు మార్చింది. అయితే ఇక్కడ ‘హేట్ క్రైమ్’ జరిగిందని, ఇందుకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒట్టావా లోని ఇండియన్ హైకమిషన్ కోరింది. కెనడా అధికారులు వెంటనే స్పందించి ఇన్వెస్టిగేట్ చేయాలని సూచించింది. బ్రాంప్టన్ నగర మేయర్ పాట్రిక్ బ్రౌన్ కూడా ఇలాగే డిమాండ్ చేశారు.
అయితే ఆ తరువాత తన ట్వీట్ ని డిలీట్ చేశారు. శ్రీభగవద్గీత పార్క్ పేరిట పర్మనెంట్ బోర్డు ఏర్పాటు చేసేంతవరకు అక్కడ బిల్డర్ తాత్కాలికంగా ఓ సైన్ బోర్డు పెట్టారని అంతే తప్ప హేట్ క్రైమ్ వంటిదేదీ జరగలేదని ఆయన మరో ట్వీట్ చేశారు. అసలు విషయం తెలిసి తాము సంతోషిస్తున్నామని, ఈ నగరం అందరినీ హృద్యంగా ఆహ్వానిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కెనడాలో భారతీయుల పట్ల, విద్యార్థుల పట్ల జాతి విద్వేష హింసాత్మక ఘటనలు జరగడానికి అవకాశం ఉందని, అందువల్ల వారంతా హైఅలెర్ట్ గా ఉండాలని ఈ మధ్యే భారత విదేశాంగ శాఖ సూచించింది. దీనితో ఇది కూడా హేట్ క్రైమ్ అని అంతా భావించారు.