భారత వ్యాక్సిన్ నిపుణుల కమిటీ సూచన మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి కరోనా వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇందులో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన కోవీషిల్డ్, భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ తయారు చేసిన కోవాక్జిన్ లు ఉన్నాయి.
కోవాక్జిన్ అత్యవసర అనుమతి పొందినప్పటికీ కేవలం కోటి డోసులు మాత్రమే అందుబాటులో ఉండగా, సీరమ్ సంస్థ తయారు చేసిన కోవీషిల్డ్ మాత్రం 10కోట్ల డోసుల వరకు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో భారత ప్రభుత్వ సంస్థలు అత్యవసర వ్యాక్సినేషన్ అనుమతిస్తూ కీలక నిబంధనను విధించాయి.
ఈ రెండు వ్యాక్సిన్స్ కు అనుమతిస్తూనే ఇతర దేశాలకు ఎగుమతులు, ప్రైవెటు మార్కెట్ లో అమ్మటం చేయరాదని… కేవలం భారత ప్రభుత్వానికి మాత్రమే సప్లై చేయాలని నిబంధన విధించాయి. అందుకు ఈ రెండు కంపెనీలు కూడా అంగీకరించాయి. దీంతో సీరం సంస్థ హామీ ఇచ్చిన 100కోట్ల డోసులు పేద దేశాలకు పంపాలనే నిబంధన ఇప్పట్లో నెరవేరేలా లేదు. పేద దేశాలకు వ్యాక్సిన్ అందాలంటే కనీసం ఏప్రిల్ వరకు వేచి చూడాల్సిందే.
ఇప్పటికే ప్రపంచంలోని ధనిక దేశాలు తమ దేశాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ ను తమ దేశానికే అధికంగా ఇవ్వాలన్న నిబంధనలను విధించాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఆ లిస్ట్ చేరింది. ఇందులో మొదటి 100కోట్ల డోసులను భారత ప్రభుత్వానికే అందులోనూ ఒక్కో డోసు కేవలం 200రూపాయలకే ఇచ్చేందుకు అంగీకరించామని సీరం సంస్థ సీఈవో ఆధార్ పునావాలా ప్రకటించారు. ఆ తర్వాత రేటు పెంచుతామని… బహిరంగ మార్కెట్ లో వ్యాక్సిన్ ధర కనీసం 1000రూపాయలు ఉంటుందన్నారు. భారత ప్రభుత్వం తమతో ఆర్డర్ చేసుకున్న డోసులను కేవలం 10రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో సప్లై చేస్తామన్నారు. అయితే, ఇండియాలో ఇచ్చే వ్యాక్సిన్ కూడా ఏయే వర్గాలకు మొదట ఇవ్వాలో గుర్తించి, ప్రాధాన్యత క్రమంలోనే ఇస్తామన్నారు.