లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం పనిచేసే ఐరాస మహిళా విభాగానికి భారత్ ఐదు లక్షల అమెరికన్ డాలర్లను అందజేసింది. ఆ సంస్థ బడ్జెట్ కోసం ఈ మొత్తాన్ని అందజేసినట్టు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఐరాస మహిళల ప్రధాన బడ్జెట్‌కు 5,00,000 అమెరికా డాలర్ల విరాళాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బాహౌస్ కు భారత్ తరఫున అందజేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అభివృద్ధి, లింగ సమానత్వం కోసం పోరాడుతున్న సంస్థలో మా విలువైన భాగస్వామ్యం ఉంటుందని మరరోసారి పునరుద్ఘాటించామన్నారు.
ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని తిరుమూర్తి శనివారం ట్వీట్ చేశారు. దీనిపై యూఎన్ వుమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ స్పందించారు. భారత్ అందించిన ఈ సహాయానికి ధన్యవాదాలు అంటూ బదులిచ్చారు. యూఎన్ విభాగానికి భారత్ అందిచిన సహాయం చాలా ముఖ్యమైనదని అన్నారు.
‘ ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కులను సమర్థించడంలో యూఎన్ మహిళల కోసం ఇండియా ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. మీ ఉదార సహకారానికి ధన్యవాదాలు’ అని సిమా బహౌస్ ట్వీట్ చేశారు.