దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. నెల రోజుల క్రితం పదివేలకు లోపు ఉన్న రోజువారీ కేసులు ఇప్పుడు మూడున్నర లక్షలకు చేరువ అయ్యాయి. మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తీరు నిపుణులకు సైతం అంతుపట్టడం లేదు. థర్డ్ వేవ్ లో గరిష్ట స్థాయి కేసులు రెండు లక్షలలోపే ఉంటాయని భావించారు. కానీ ఇప్పుడు నాలుగు లక్షలకు చేరువ అవుతున్నట్టు కనిపిస్తోంది. కొత్తగా 3,47,254 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో కరోనా రోగుల సంఖ్య 3,85,66,027కి చేరింది.
తాజాగా నమోదైన మరణాల రేటు కూడా ఆందోళన కలిగిస్తొంది. గడిచిన 24 గంటల్లో 703 మందిని మహమ్మారి బలిగొంది. థర్డ్ వేవ్ లో ఈ స్థాయి మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈరోజు 2,51,777 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,60,58,806కి చేరింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 20,18,825 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 93.50 శాతానికి పెరిగింది.
కరోనాతో పాటు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 9,692 కేసులు వెలుగు చూశాయి. మొత్తం 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్ ని గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా కట్టడిలో భాగంగా టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 70,49,779 డోసులు అందించారు. ఇప్పటివరకు 1,60 కోట్ల వ్యాక్సిన్లు అందించినట్టు అధికారులు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కరోనా పరీక్షలు కూడా గణనీయంగా పెంచారు. గురువారం రోజు 19,35,912 కరోనా టెస్టులు నిర్వహించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 71.15 కోట్లు దాటింది.