దేశంలో కరోనా మహమ్మారి భయానక వాతావరణం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా మరణాలు సంఖ్య కూడా తీవ్ర ఆంధోళనకు గురి చేస్తోంది. అయితే.. ఈ రోజు కేసులు సంఖ్య స్వల్పంగా తగ్గింది. ముందు రోజుకంటే సుమారు 10 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,37,704 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,89,03,731కి చేరింది. కొత్తగా 488 మంది వైరస్ తో మృతి చెందారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారికి 4,88,884మంది బలైయ్యారు.
ఈరోజు 2,42,676 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తం 3,63,01,482మంది రికవరీ అయ్యారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.22 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా కేసులతో పాటు ప్రతీ రోజు ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10,050కి చేరినట్లు తెలిపింది.
దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నారు. మాస్కులు వాడకం, సామాజిక దూరం పాటించడం వంటివి తప్పని సరిచేశారు. దీనికి తోడు దేశంలో వ్యాక్సినేష్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 67,49,746 డోసులు అందించారు.
ఇప్పటి వరకు 1,61,16,60,078 వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి మొదటి డోసు వ్యాక్సిన్ అందిస్తున్నారు. అటు, 60 ఏళ్లు పై బడిన వారికి బూస్టర్ డోసులు కూడా పంపిణీ చేస్తున్నారు. తాజాగా 12 నుంచి 15 ఏళ్ల లోపు ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.