టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అది చాలా సార్లు, చాలా రకాలుగా రుజువైంది కూడా. తాజాగా ధోనీ అంటే పడిచచ్చే అభిమాని ఒకరు.. పెద్ద సాహసమే చేశాడు. ధోనీని కలిసేందుకు ఆయన ఇంటికి ఏకంగా 1,400 కిలోమీటర్లకు పైగా కాలినడకన వచ్చాడు.
హర్యానాలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు. జార్ఖండ్‌లోని రాంచీ వరకు నడచుకుంటూనే వచ్చాడు. జూలై 29న తన ప్రయాణం మొదలుపెట్టిన 16 రోజులు తర్వాత ధోనీ ఇంటికి చేరాడు. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ధోనీ ఇక్కడలడు. ఐపీఎల్- 2021 కోసం శుక్రవారం దుబాయ్ వెళ్లేందుకు.. ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడు. ధోనీ తిరిగి రావడానికి మూడు నెలల సమయం పడుతుందని చెప్పినా.. అప్పటివరకూ అక్కడే ఉంటానని పట్టుపట్టాడు. అయితే కొందరు స్థానికులు అతనికి బస ఏర్పాటు చేసి.. హర్యానాకు వెళ్లేందుకు విమానం టికెట్ ఇప్పించారు. ధోనీ వచ్చిన తర్వాత మళ్లీ రావాలని ఒప్పించి పంపించారు.
ధోనీని కలిసేందుకు అంతసాహసం ఎందుకు చేశావని అడగ్గా.. తాను ఒకప్పుడు క్రికెటర్ కావాలని అనుకున్నానని కానీ.. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్టు చెప్పాడు. అయితే ధోనీ దీవెనలతో మళ్లీ క్రికెట్ ఆడటం ప్రారంభించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.