బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ కేసులు ఇండియాలోనూ నమోదవుతున్నాయి. బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ ప్రకటించగానే ఆ దేశం నుండి వచ్చే విమానాలపై భారత్ నిషేధం విధించినప్పటికీ… కేంద్రం మేల్కొనే లోపే వైరస్ ఎంటర్ అయిపోయింది. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కొత్త వైరస్ కేసులు 6 నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో బెంగళూరులో 3, హైదరాబాద్ లో 2, పుణేలో ఒకరికి కొత్త స్ట్రెయిన్ కేసులు నిర్ధారించినట్లు బులిటెన్ వెల్లడించింది. బ్రిటన్ నుండి వచ్చిన మొత్తం 33వేల మందిని పరీక్షించగా 114మందికి వైరస్ ఉన్నట్ల నిర్ధారణ అయ్యిందని, అందులో 6గురికి ఈ కొత్త స్ట్రెయిన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపింది.
కొత్త స్ట్రెయిన్ ఉన్న వారి కాంటాక్ట్ ట్రేసింగ్ నడుస్తుందని, వైరస్ ఉన్న వారిని ఒక్కో గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
బ్రిటన్ లో గుర్తించిన ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ కరోనా స్ట్రెయిన్ తో యువత, పిల్లల్లోనూ కేసులు ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరించింది.