తాలిబాన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత ఆప్ఘానిస్థాన్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అక్కడి అధికారులను ఇండియాకు రప్పించే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందుకోసం వైమానిక దళానికి చెందిన సి-17 విమానాలను రంగంలోకి దింపింది. ఎంబసీ సిబ్బందిలోని 40 మందితో కూడిన ఓ విమానం సోమవారమే భారత్‌కు చేరినట్టు తెలుస్తుండగా.. మంగళవారం ఉదయం మరో 120 మందితో కూడిన మరో సి-17 విమానం కాబూల్ నుంచి ఇండియాకు బయలుదేరినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఆప్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు ఏ మాత్రం బాగాలేకపోవడంతో తక్షణమే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను వెనక్కి రప్పిస్తున్నట్టు భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ మంగళవారం ఉదయం ట్విటర్ వేదికగా తెలిపారు. వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో వారిని తీసుకొస్తున్నట్టు చెప్పారు.
పాకిస్థాన్ గగన తలం బదులుగా ఇరాన్ గగనతలం నుంచి ఈ విమానాలు అఫ్గానిస్థాన్‌కు చేరి.. అక్కడి భారత అధికారులను దేశానికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆఫ్ఘాన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్థాన్‌లో ఎయిర్‌పోర్టులు తెరిచి ఉండటం చాలా ముఖ్యమని.. తాలిబాన్ల ప్రతినిధులతో యూఎస్ ద్వారా చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులెవరూ ఆందోళన పడవద్దని.. ధైర్యం చెప్పారు. మరిన్ని వివరాల కోసం +919717785379, MEAHelpdeskIndia@gmail.comను సంప్రదించాలని సూచించారు.