జాతీయ భద్రతలో సైబర్ సెక్యూరిటీ అంతర్భాగమన్నారు ప్రధాని మోడీ. రక్షణ మంత్రిత్వ శాఖ పోస్ట్-బడ్జెట్ వెబినార్ లో పాల్గొన్న ఆయన.. సైబర్ సెక్యూరిటీ దేశ రక్షణకు సంబంధించిన అంశంగా మారిందని అభిప్రాయపడ్డారు. రక్షణ రంగంలో భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం బలాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఐటీ పరిజ్ఞానాన్ని రక్షణ రంగంలో ఎంత వినియోగించుకుంటే భద్రతాపరంగా అంత ధీమాగా ఉండగలమని వ్యాఖ్యానించారు.
‘భారత ఐటీ రంగం మనకు గొప్ప బలం. ఈ శక్తిని మన రక్షణ రంగంలో ఎంత ఎక్కువగా ఉపయోగిస్తామో, మన భద్రతపై అంత నమ్మకం ఉంటుంది. సైబర్ భద్రత అనేది ఇకపై డిజిటల్ ప్రపంచానికే పరిమితం కాదు’ అని చెప్పారు. గత 5-6 ఏళ్లలో దేశం తన రక్షణ ఎగుమతులను ఆరు రెట్లు పెంచుకుందని వివరించారు ప్రధాని. ఇది ఎంతో సంతోషించే విషయమని పేర్కొన్నారు. భారత్ నేడు 75 కంటే ఎక్కువ దేశాలకు మేడిన్ ఇండియా రక్షణ పరికరాలు, సేవలను అందిస్తుందని చెప్పడం గర్వంగా ఉందని తెలిపారు.
గత సంవత్సరం ఏడు కొత్త డిఫెన్స్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని. ‘మన ఆర్డినెన్స్ కర్మాగారాలు దృఢ సంకల్పంతో, పూర్తి చిత్తశుద్ధితో ముందుకు సాగినప్పుడు మనం ఆశించిన ఫలితాలను సాధించగలం. గతేడాది మేము ఏడు కొత్త రక్షణ ప్రభుత్వ సంస్థలను సృష్టించాం. నేడు అవి వేగంగా కొత్త మార్కెట్ లను చేరుకుంటున్నాయి’ అని చెప్పారు మోడీ.
మేకిన్ ఇండియాకు ప్రభుత్వ ప్రోత్సాహానికి అనుగుణంగా గత ఏడేళ్లలో రక్షణ పరికరాల తయారీకి 350కి పైగా కొత్త పారిశ్రామిక లైసెన్సులు జారీ చేశామన్నారు ప్రధాని. అదే.. 2001 నుంచి 2014 వరకు 14 ఏళ్లలో 200 లైసెన్సులు మాత్రమే జారీ అయ్యాయని గుర్తు చేశారు.