భారత్ సాయుధ బలగాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 27 ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు సియోమ్ వంతెనను ప్రారంభించిన కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న రాజ్ నాథ్ సింగ్.. సున్నిత సరిహద్దు ప్రాంతాలలో భారత సాయుధ దళాల కదలికలు సులభతరం చేయడానికి 724 కోట్ల వ్యయంతో 28 ప్రాజెక్టులు నిర్మించినట్లు స్పష్టం చేశారు. దేశాల ప్రాధాన్యతలు,ఆసక్తులు ఎప్పటికప్పుడు మారుతాయని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఏ దేశమైనా తనను తాను శక్తివంతంగా ఉంచుకోవడం అవసరమని చెప్పారు.
దేశ భూభాగాన్ని పరిరక్షించేందుకు సరిహద్దు వెంబడి సవాళ్లను తిప్పికొట్టే శక్తి భారత్ కు ఉందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని ప్రోత్సహించదని, పొరుగు దేశాలతో ఎల్లప్పుడూ సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుందని చెప్పారు.
ఇది యుద్ధ యుగం కాదని ప్రధాని మోడీ చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ..యుద్ధం మీద తమకు నమ్మకం లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ప్రయోగం ఎవరైనా చేస్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.