దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఫోర్త్ వేవ్ దిశగా రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 43 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
కొత్త కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 1,25,028కి చేరింది. తాజాగా 16,104 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 4.14 శాతంగా ఉంది. శుక్రవారంతో పోలిస్తే కేసుల్లో పెరుగుదలతోపాటు మరణాల సంఖ్య కూడా పెరిగింది.
దేశంలో కొత్త వేరియంట్ ను గుర్తించిన తర్వాత కరోనా భయాలు ఎక్కువయ్యాయి. సర్వత్రా ఫోర్త్ వేవ్ టెన్షన్ నెలకొంది. గత మూడు వేవ్స్ లో ఎదురైన విపత్కర పరిస్థితులను తలుచుకుని జనం భయంతో వణికిపోతున్నారు. ఇప్పుడు రోజురోజుకీ కేసులు పెరుగుతుండడంతో తీవ్ర భయాందోళనలో జీవనం సాగిస్తున్నారు. అధికారులు, వైద్యులు కరోనా రూల్స్ ను పాటించాలని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు గడిచిన 24 గంటల్లో 12,26,795 మందికి వ్యాక్సిన్ అందించింది కేంద్రం. ఇప్పటిదాకా 198 కోట్ల 65లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందించినట్లు కేంద్రం వెల్లడించింది.