లడఖ్ లో చైనా చాపకింద నీరులా మెల్లగా భారత భూభాగాలపై కన్నేస్తూ చొరబాటు సన్నాహాలు చేస్తున్న షాకింగ్ వాస్తవం వెల్లడైంది. తూర్పు లడఖ్ ప్రాంతంలోని 65 పెట్రోలింగ్ (గస్తీ) పాయింట్లకు గాను మన జవాన్లు 26 పాయింట్లను కోల్పోయారని ఈ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. లడఖ్ తూర్పు ప్రాంతంలోని కారాకోరం కనుమ నుంచి చుమ్నూర్ వరకు గల పాయింట్ల వద్ద భారత దళాలు రెగ్యులర్ గా గస్తీ తిరగాల్సి ఉందని, కానీ ఈ 65 పాయింట్లకు గాను 26 పాయింట్లను మనం కోల్పోయామని, అంటే ఈ ప్రాంతాల్లో మన దళాల గస్తీ విధులు ఆగిపోయాయని ఆ అధికారి పేర్కొన్నారు.
ఈ పాయింట్ల వద్ద భారత జవాన్లు గానీ.. పౌరులు గానీ లేరంటే చైనాకు ఈ భూభాగాలను మనం అప్పగించినట్టే అవుతుందని, ఆ దేశ దళాలు ఒక్కో అంగుళం భారత భూమిని క్రమంగా ఆక్రమించడానికి ఇది దారి తీస్తుందని పి.డి. నిత్యా అనే ఈ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని లడఖ్ లో ‘సలామీ స్లైసింగ్’ అని వ్యవహరిస్తారన్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి రాసిన లేఖ తాలూకు రీసెర్చ్ పత్రాన్ని ఓ వార్తా సంస్థ ప్రచురించింది. ఈ రిపోర్టుపై ఇటీవల ఢిల్లీలో జరిగిన వార్షిక అత్యున్నత స్థాయి పోలీసు అధికారుల సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.
ఈ గస్తీ పాయింట్ల వద్ద భారత జవాన్లు లేరు గనుక ఇవి ఇక తమకే చెందినవని చైనా వాదించే సూచనలున్నాయని, బఫర్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లోని పెట్రోలింగ్ పాయింట్లపై మన ఆధిపత్యం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆ ఎస్పీ పేర్కొన్నారు. భారత జవాన్ల కదలికలను పసిగట్టేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎత్తయిన పర్వత శిఖరాలపై కెమెరాలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. తమ సైన్యాన్ని ఆయా పాయింట్ల వద్ద ఉపసంహరిస్తున్నామని చర్చల సందర్భంగా చెబుతున్నప్పటికీ.. పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు.
బఫర్ జోన్ లోని కొన్ని ప్రాంతాలు తమవేనని చెప్పుకుని.. అక్కడినుంచి భారత జవాన్లను వెనక్కి వెళ్ళాల్సిందిగా డ్రాగన్ కంట్రీ బలగాలు ఒత్తిడి చేయవచ్చునన్నారు. 2020 లో గాల్వన్ లోయలో ఈ తరహా చైనా వ్యూహాన్ని మనం చూశాం.. నాడు ఉభయ దేశాల సైనికులకు మధ్య జరిగిన పోరులో 20 మంది మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారు అని నిత్యా గుర్తు చేశారు.అయితే ఫ్రిక్షన్ ప్రాంతాల్లో జవాన్ల ఉపసంహరణ వల్ల మన భూభాగాన్ని కోల్పోయే ప్రమాదం లేదని రక్షణ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించుకునేంతవరకు కొన్ని ప్రాంతాల్లో ఉభయ దేశాల సైనికుల గస్తీని పరిమితం చేయడం జరిగిందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. మనం కూడా ఎన్నో కెమెరాలను ఏర్పాటు చేశామని అందువల్ల చైనా దళాల బూచిని చూసి భయపడాల్సిన అవసరం లేదని వివరించాయి.