దగ్గు మందుల ఎగుమతులకు సంబంధించి కేంద్రం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దగ్గు సిరప్‌ల ఎగుమతికి ముందు ప్రభుత్వ ల్యాబ్ లల్లో అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని తెలిపింది. ఇక నుంచి ప్రభుత్వ ల్యాబ్‌ల్లో తనిఖీల తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొంది.
జూన్ 1 నుంచి దగ్గు మందు ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను నిర్దేశించిన ప్రభుత్వ ల్యాబోరేటరీల్లో టెస్టులు చేయించుకోవాల్సి వుంటుందని వెల్లడించింది. ఇటీవల భారత్‌కు చెందిన పలు ఫార్మా కంపెనీలు ఎగుమతి చేస్తున్న దగ్గు సిరప్‌ల నాణ్యతపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ల్యాబ్ టెస్టుల తర్వాత ఉత్పత్తులకు సంబంధించి ఎనాలిసిస్ చేసిన సర్టిఫికేట్ ను ఇవ్వనున్నట్టు చెప్పింది. ఆ సర్టిఫికేట్ ను చూపించినప్పుడే ఎగుమతులకు అనుమతించనున్నట్టు తెలిపింది.
ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇండియా ఫార్మకోఫోయియా, ఆర్‌డీటీఎల్ – చండీఘర్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ – కోల్‌కతా, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ – చెన్నై, హైదరాబాద్, ముంబై, ఆర్‌డీటీఎల్ – గువహటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన ఎన్ఏబీఎల్ వంటి ల్యాబ్‌ల్లో దగ్గు సిరప్‌లను పరీక్షించేందుకు అవకాశం కల్పించారు.
భారత్ నుంచి ఎగుమతయ్యే ఫార్మా ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇవ్వడంలో భారత నిబద్ధతను తెలిపేందుకు ఈ ప్రీ క్వాలిటీ చెక్ ప్రక్రియను కేంద్రం తీసుకు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ సంస్థ తను కంప్లీట్ బ్యాచ్ ‘ఐ డ్రాప్స్’ను వెనక్కి తీసుకుంది.