ప్రతికూల పరిస్థితుల్లోనూ డ్రాగన్ దుశ్చర్యలను భారత్ సమర్థవంతంగా తిప్పి కొట్టిందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో 2020 మేలో సరిహద్దు వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించిందన్నారు. అప్పుడు చైనా కుయుక్తులను భారత్ బలంగా తిప్పికొట్టిందన్నారు.
గత ఒప్పందాలను తుంగలో తొక్కుతూ సరిహద్దులను మార్చేందుకు చైనా భారీగా బలగాలను మోహరించిందన్నారు. సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లోనూ డ్రాగన్ దుశ్చర్యలను భారత సైన్యం అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు.
భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టడం అసలు సాధ్యం కాదని చైనాతో ఘర్షణ ఉదంతంతో ప్రపంచం తెలుసుకుందన్నారు. అందువల్లే అంతర్జాతీయంగా భారత్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. దేశ భద్రత కోసం అవసరమైతే భారత్ ఎంత దూరమైనా వెళ్తుందని ఈ ఘటన స్పష్టం చేసిందన్నారు.
మోడీ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టాక పలు రంగాల్లో భారత్ దూసుకుపోతోందన్నారు. గ్లోబల్ అజెండా రూపకల్పనలో భారత్ ఇప్పుడు అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అవసరాన్ని బట్టి కొన్ని అంశాలకు భారత్ దూరంగా ఉంటోందని స్పష్టం చేశారు.
అవసరం అనుకున్నప్పడు భారత్ తన గళాన్ని గట్టిగా వినిపిస్తోందన్నారు. రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత ప్రాధాన్యాలపై ఇతర దేశాల పెత్తనాన్ని అనుమతించకపోవడం చాలా అవసరమని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.