గాల్వాన్ నదీ లోయలో చైనా ఆర్మీ- భారత జవాన్లకు మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. భారత్ ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, భారత సమగ్రత, సార్వభౌమాధికారం కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది.
భారత సైనికులతో జరిగిన ఘర్షణలో చైనా సైనికులు కూడా గాయపడ్డట్లు భారత సైన్యం వద్ద సమాచారం ఉంది. కానీ ఎంత మంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులయ్యారన్నది మాత్రం చైనా ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు చైనాకు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, అటు వైపు కూడా 40మంది మరణించారని జాతీయ మీడియా, తెలుగు టీవీ ఛానళ్ల్ ప్రకటించాయి. ఈ సంఖ్య 108 వరకు ఉందని… అందుకు సాక్ష్యాలుగా ఉపగ్రహ చిత్రాలతో తీసిన సమాధులను చూపించాయి. దీంతో అంతా నిజమేననుకున్నారు. ప్రముఖ వార్తా సంస్థలన్నీ ప్రకటిస్తూ, బ్రేకింగ్ వేస్తూ హాడావిడి చేశాయి.
కానీ అవి ఇప్పటివి కావని, 1962 నాటి యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులని తెలుస్తోంది. ఇటీవల భారత మీడియా వేసిన వీడియోలు, వేసిన ఫోటోలన్నీ నాటివేనని తెలుస్తుంది. ఇక మరికొన్ని సమాధులు మాత్రం 2011నాటివని అప్పటి ఉపగ్రహ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, కొన్ని టీవీ ఛానళ్లలో తిరుగుతున్న ఫోటోలన్నీ పాతవేనని రక్షణ శాఖ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.