ఓ రైతును అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. అయితే, అది అంతా సులువుగా ఏం కాదు. రైతు లక్షాధికారి కావటం వెనుక మూడు నెలల కష్టం ఉంది. లీజుకు తీసుకున్న భూమిలో అత్యంత నాణ్యమైన వజ్రం లభించింది ఆయనకి. వేలంలో ఈ వజ్రానికి కనీసం రూ. 50 లక్షల ధర పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో జరిగింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో ప్రతాప్ సింగ్ యాదవ్ అనే రైతు ఓ భూమిని లీజుకు తీసుకుని మూడు నెలలుగా వజ్రాల కోసం తవ్వుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయనకి 11.88 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ విషయాన్ని వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ తెలిపారు. ఈ వజ్రం ఎంతో నాణ్యంగా ఉందని అధికారులు ప్రతాప్‌కు శుభవార్త చెప్పారు.
అంతేకాదు, వ్యాపారుల అంచనాల ప్రకారం ప్రతాప్ సింగ్‌కు దొరికిన వజ్రం పబ్లిక్ సేల్‌లో రూ. 50 లక్షల కంటే ఎక్కువ పొందవచ్చని తెలిపారు. ముడి వజ్రాన్ని వేలం వేసి ప్రభుత్వ రాయల్టీ, పన్నులను మినహాయించి వచ్చిన డబ్బును రైతుకు అందజేస్తామని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతాప్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు దొరికిన వజ్రాన్ని డైమండ్ కార్యాలయంలో అప్పగించానని, వేలంలో వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని పేర్కొన్నాడు. అలాగే, తన పిల్లల చదువుల కోసం కొంత ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఏ విషయంలో అయినా సరే ప్రయత్నిస్తే.. విజయం దక్కుతుంది అనడానికి తన ప్రయత్నమే ఉదాహరణ అని అంటున్నాడు ప్రతాప్ సింగ్ యాదవ్.
అయితే, పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు అధికారులు. గత ఏడాది ఏపీలో ఓ రైతుకు ఇలాంటి అదృష్టమే వరించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కూలీకి పొలంలో పని చేసుకుంటుండగా వజ్రం దొరికింది. దాని విలువ కొన్ని కోట్లు పలికింది.