టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్ లో ఉంది. ఈమధ్యే టీ-20 సిరీస్ పూర్తి చేశాయి ఇరు జట్లు. ప్రజెంట్ వన్డే సిరీస్ కొనసాగుతోంది. మొదటి మ్యాచ్ కివీస్ సొంతం చేసుకోగా.. రెండోది భారత్ నెగ్గాలని ఫ్యాన్స్ పూజలు చేశారు. కానీ, వరుణుడు అడుగడుగునా అడ్డు తగిలాడు. దీంతో చేసేది లేక మ్యాచ్ ను రద్దు చేశారు అంపైర్స్.
హామిల్టన్ వేదికగా రెండో వన్డేను ఎలాగైనా గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉండగా.. టాస్ గెలిచింది కివీస్. ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో కెప్టెన్ శిఖర్ ధవన్, శుభ్ మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి వన్డే మాదిరిగానే శుభారంభాన్ని అందించారు ఇద్దరు. గిల్ 21 బాల్స్ లో 19 రన్స్ చేయగా, ధవన్ 8 బంతుల్లో 2 పరుగులు చేశాడు. అయితే.. ఇన్నింగ్స్ 4.5 ఓవర్ లో ఉండగా వరుణుడు తగులుకున్నాడు.
వర్షం బాగా పడడంతో ఫీల్డ్ అంపైర్స్ మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. కాసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత మొదలు పెట్టారు. భారత ఇన్నింగ్స్ 12.5 ఓవర్ల వద్దకు రాగానే మరోసారి భారీ వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్స్ తేల్చేశారు. మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి భారత్ స్కోర్ 89/1 గా ఉంది. ధవన్ 3 పరుగులకే ఔట్ కాగా.. గిల్ 45(నాటౌట్), సూర్యకుమార్ 45(నాటౌట్) రన్స్ సాధించారు.
మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే 1-0తో వెనుకబడింది టీమిండియా. తొలి వన్డేలో కివీస్ విజయం సాధించింది. దీంతో బుధవారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగే చివరి వన్డే కీలకం కానుంది. ఆ మ్యాచ్ లో కివీస్ గెలిస్తే సిరీస్ ఆ దేశం సొంతమవుతుంది. భారత్ విజయం సాధిస్తే మాత్రం సిరీస్ 1-1తో సమం అవుతుంది.