చమురు కంపెనీలు ప్రజలపై పగ పెంచుకున్నట్టే ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై రోజుకింత వడ్డిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్న సంస్థలు.. ఇక వంట గ్యాస్‌పై పడ్డాయి. ఇప్పటివరకు నెలకోసారి సిలిండర్ ధరలను సవరిస్తూ వస్తున్న కంపెనీలు.. వచ్చే ఏడాది నుంచి ప్రతి వారం వాత పెట్టాలని భావిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతి రోజూ ధరలు మారుతోంటే.. తాము నెల మొత్తం నష్టపోతున్నామని చమురు కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో రోజులకు ఓసారి ధరలు.. సవరించి తమ నష్టాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే బండపై బాదుడు మొదలైంది. ఈ నెలలోనే రెండుసార్లు ధరలు పెంచాయి. డిసెంబర్ 2న సబ్సిడీ సిలిండర్ ధర రూ.50 పెరగగా.. డిసెంబర్ 15న మరోసారి అంతే మొత్తం పెరిగింది. ఇప్పుడు వారానికోసారి ధరలను సవరిస్తే.. ఏడాది తిరిగిలోపే సిలిండర్‌పై భారీగా ధర పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.