సరిహద్దు ప్రాంతాల్లో గగనతల ఉల్లంఘనలను మానుకోవాలని చైనాను భారత్ హెచ్చరించింది. జూన్ చివరి వారంలో ఎల్ఏసీ వద్ద చైనా యుద్ద విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి.
ఎల్ఏసీకి సుమారు పది కిలోమీటర్ల పరిధిలోకి చైనా విమానాలు చొచ్చుకు వచ్చాయి. దీంతో భారత వాయుసేన రంగంలోకి దిగింది. భారత యుద్ద విమానాలను గమనించిన చైనా ఫైటర్ జెట్ వెనక్కి మళ్లింది.
ఈ క్రమంలో భారత- చైనాల మధ్య ప్రత్యేక సైనిక చర్చలు నడిచాయి. తూర్పు లడఖ్ ప్రాంతంలోని చుషుల్ మోల్డ్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికాధికారులు సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో ఆర్మీ అధికారులతో పాటు వాయుసేనకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఇందులో భారత వైమానిక దళ ఆపరేషన్ శాఖకు చెందిన ఎయిర్ కమాండర్ అమిత్ శర్మ ప్రాతినిధ్యం వహించారు.
సరిహద్దుల వద్ద గగన తల ఉల్లంఘనలకు చైనా పాల్పడటాన్ని భారత్ తప్పు పట్టింది. చైనా చర్యను ఈ సందర్బంగా భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోసారి ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడవద్దని హెచ్చరించింది.