పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ని అమెరికా రాయబారి డేవిడ్ బ్లోమ్ విజిట్ చేయడం పట్ల భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాన్ని అమెరికా ‘విముక్తి’ పొందిన ప్రాంతంగానో .ఫ్రీ జమ్మూ కశ్మీర్ అనే నినాదంతోనో ప్రస్తావిస్తోందని, ఇది తగదని ప్రకటించింది. డేవిడ్ బ్లోమ్ ..ముజఫరాబాద్ ని, నియంత్రణ రేఖ వెంబడి గల కొన్ని ప్రాంతాలను కూడా సందర్శించారని, వీటిని ఇండియా తన భూభాగాలుగా గుర్తిస్తున్నదని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఆయన ఈ నెల 2-5 తేదీల మధ్య పలువురితో సమావేశాలు జరిపిన విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి పేర్కొంటూ.ఓ స్టేట్ మెంట్ విడుదల చేశారు.
అమెరికా-పాకిస్తాన్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి డేవిడ్ ఇక్కడికి వచ్చారని ఇస్లామాబాద్ లోని అమెరికన్ రాయబారకార్యాలయం పేర్కొందని, అయితే తమ అభ్యంతరాన్ని అమెరికాకు తెలియజేశామని ఆయన పేర్కొన్నారు. కానీ దీని వివరాలను ఆయన స్పష్టం చేయలేదు.
అమెరికాలో ప్రభుత్వం మారిన తరువాత ఢిల్లీలో అమెరికా రాయబారి ఎవరూ నియమితులు కాలేదు. 2021 జనవరి నుంచి ఇక్కడ ఈ పోస్టు ఖాళీగానే ఉంది. లాస్ ఏంజిలిస్ మేయర్ ఎరిక్ గర్సెట్టిని ఈ పదవిలో నియమించాలని జోబైడెన్ ప్రభుత్వం భావించినా.. కొన్ని సమస్యల కారణంగా అది అమలు కాలేదు. నవంబరులో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగడానికి ముందు ఇవి పరిష్కారమవుతాయా అన్నది తేలడం లేదు.
పాకిస్థాన్ కు అమెరికా ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాలను సమకూర్చడం పట్ల కూడా భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లకోసమే ఆ దేశం వీటిని వినియోగిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ చెబుతున్నప్పటికీ దీన్ని ఇండియా నమ్మడం లేదు. ఇరాన్ నుంచి ఆయిల్ ని దిగుమతి చేసుకున్నందుకు ముంబైలోని తిబలాజీ పెట్రోలియం సంస్థపై అమెరికా గతనెల 29 న ఆంక్షలు విధించింది కూడా.. ఇండియాకు వ్యతిరేకంగా ఆ దేశం మొదటిసారిగా ఇలాంటి చర్య తీసుకుంది.