భారత్-పాక్‌లు నూతన సంవత్సరం కూడా పాత సాంప్రదాయాన్ని కొనసాగించాయి. ఖైదీల జాబితా, అణు స్థావరాలకు సంబంధించిన వివరాలను ఇరు దేశాలు పరస్పరం మార్చుకున్నాయి. కొన్నేండ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
ఢిల్లీ, ఇస్లామాబాద్‌లోని ఇరు దేశాల రాయబార కార్యాలయాల్లో అధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో అణు కేంద్రాలు, ఖైదీల సమాచారాన్ని ఇరు దేశాల అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సమయంలో అణు స్థావరాలపై దాడులు చేయకూడదని 1992లో ఒప్పందం చేసుకున్నాయి.
అప్పటి నుంచి ఆ వివరాలను మార్పిడి చేసుకుంటున్నాయి. ఇరు దేశాల ఖైదీల సమచారాన్ని ఇచ్చి పుచ్చుకున్నాయి. సముద్రంలో దారి తప్పి భారత్ మత్స్యకారులు పాక్ ప్రాదేశిక జలాల్లోకి, పాక్ మత్స్యకారులు భారత ప్రాదేశిక జల్లాలోకి ప్రవేశించి అధికారులకు చిక్కారు.
ఈ నేపథ్యంలో ఇరు దేశాలు మత్స్యకారులను జైలు నుంచి విడుదల చేసేందుకు ఓ ఒప్పందానికి వచ్చాయి. వారి పడవలను కూడా అప్పగించేందుకు అంగీకరించాయి. అణు స్థావరాలు, ఖైదీల జాబితాలను ఇరు దేశాలు మార్పిడి చేసుకోవడం 1992 జనవరి 1 నుంచి ఇది 32వ సారి.