ఈ దశాబ్దం చివరి నాటికి దేశంలో 6 జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అభివృద్ధి, ఉపాధి కల్పనను వేగవంతం చేయడంలో వేగవంతమైన, సమర్థవంతమైన సాంకేతికత ప్రాముఖ్యతను ఆయన వివరించారు.
21వ శతాబ్ధంలో భారతదేశం పురోగతి వేగాన్ని కనెక్టివిటీ నిర్ణయిస్తుందన్నారు. అందువల్ల, ప్రతి స్థాయిలో కనెక్టివిటీని మరింత ఆధునీకరించాలన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రజతోత్సవ వేడుకల్లో స్వీయ-నిర్మిత 5జీ టెస్ట్ బెడ్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు.
ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకురావాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. 5జీ సాంకేతికత దేశ పాలన, సౌలభ్యం, వ్యాపార నిర్వహణలోనూ సానుకూల మార్పులను తీసుకురాబోతోందని మోడీ అన్నారు.
‘ ఇది వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ వంటి ప్రతి రంగంలో వృద్ధిని పెంచుతుంది. దీని వల్ల సౌలభ్యం పెరుగుతుంది అనేక ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి’ అని పేర్కొన్నారు. ‘ 5జీని వేగవంతంగా తీసుకురావడంలో ప్రభుత్వం, పరిశ్రమల కృషి అవసరం’అని వివరించారు.
Advertisements
‘నేడు దేశంలోని ప్రతి గ్రామాన్నీ ఆప్టికల్ ఫైబర్ కలుపుతోంది. 2014కి ముందు దేశంలో కనీసం 100 గ్రామ పంచాయతీలకు కూడా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వలేదు. ఈ రోజు మేము బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని దాదాపు 1.75 లక్షల గ్రామ పంచాయతీలకు చేరేలా చేశాము. దీనివల్ల వందలాది ప్రభుత్వ సేవలు గ్రామాలకు చేరుతున్నాయి’అని వివరించారు.