ప్రపంచ ఆకలి సూచీ-2022లో భారత్ ఆరు స్థానాలు పడిపోయింది. మొత్తం 121 దేశాలకు గాను ఈ ర్యాంకులను ప్రకటించగా భారత్ 107వ స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో ఆప్ఘనిస్తాన్ మినహా అన్ని దేశాలు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం.
దాయాది దేశం పాకిస్తాన్ 99వ స్థానంలో నిలిచింది. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక సైతం 64వ ర్యాంకుతో భారత్ కన్నా మెరుగైన స్థితిలో ఉండటం విశేషం. బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, మయన్మార్ 71వ స్థానంలో భారత్ కన్నా మెరుగైన ర్యాంకులను పొందాయి.
ఈ ర్యాంకుల్లో కేవలం 15 దేశాలు మాత్రమే భారత్ కన్నా వెనుకబడి ఉన్నాయి. వాటిలో జాంబియా, ఆఫ్ఘనిస్తాన్, టిమూర్ లిస్టే, గినియా బిసావ్, సియిరా లియోన్, లెసోతో, లైబిరీయా, నైజర్, హైతీ, చాద్, డెమ్, రిపబ్లిక్ ఆఫ్ దీ కాంగో, మడగాస్కర్, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, యెమన్ లు ఉన్నాయి.
వీటితో పాటు మొజాంబిక్, యుగాండా, జింబాంబ్వే, బురుండీ, సొమాలియా, దక్షిణ సుడాన్, సురియా దేశాల ర్యాంకులను ప్రకటించలేదు. ఆయా దేశాల్లో సమాచారం అందుబాటులోకి లేకపోవడంతో వాటిని జాబితాలో చేర్చనట్టు నివేదిక వెల్లడించింది.
ఆకలి సూచీలో భారత్ స్థానం పడిపోవడంపై కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. మోడీ పాలన చేపట్టిన 2014 నుంచి ఆకలి సూచీలో భారత్ స్కోర్ పడిపోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఫైర్ అయ్యారు.
హిందుత్వ, హిందీని దేశ ప్రజలపై బలవంతంగా రుద్దడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం లాంటివి ఆకలికి విరుగుడు కావని ఆయన మండిపడ్డారు. లోక్ సభ ఎంపీ కార్తీ చిదంబరం కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ర్యాంకులను బీజేపీ తిరస్కరిస్తుందన్నారు. ఈ అధ్యయనం నిర్వహించిన సంస్థపై బీజేపీ దాడులు చేస్తుందన్నారు.
ఈ నివేదికను ఐరిష్ సంస్థ కన్సర్న్ వరల్డ్ వైడ్, జర్మనీ సంస్థ వెల్ట్ హంగర్ హైలైఫ్ లు కలిసి సంయుక్తంగా ప్రచురించాయి. పోషకాహార లోపం, శిశుమరణాలు, చైల్డ్ స్టంటింగ్ వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని దేశాలకు ర్యాంకులు కేటాయించాయి.
మొత్తం 100 పాయింట్లకు ఈ ర్యాంకులను ప్రకటించాయి. ఇందులో 0 పాయింట్లు పొందిన దేశం అత్యుత్తమైన దేశంగా పేర్కొంటారు. 100 పాయింట్లు వచ్చిన దేశాన్ని ఆకలి అధికంగా దేశంగా ప్రకటిస్తారు. ఇందులో భారత్ 29.1 పాయింట్లతో ఆందోళన కలిగించే కేటగిరిలో నిలిచింది.