వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ చరిత్ర సృష్టించింది. 200 కోట్ల మైలురాయిని అందుకుంది. ఇప్పటిదాకా 200 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ట్విట్టర్ లో స్పెషల్ ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.
‘‘భారతదేశానికి అభినందనలు. అందరి కృషి వల్లనే నేడు దేశం 200 కోట్ల వ్యాక్సిన్ల సంఖ్యను దాటింది. మోడీ హయాంలో ఇండియా చరిత్ర సృష్టించింది. ప్రధాని నాయకత్వంలో సాధించిన ఈ అసాధారణ విజయం చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ట్వీట్ చేశారు కేంద్రమంత్రి.
మాండవీయ ట్వీట్ ను రీట్వీట్ చేశారు ప్రధాని మోడీ. భారత్ 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ అభినందనలు తెలియజేశారు. ఇది కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసిందని తెలిపారు. వ్యాక్సిన్ ను విడుదల చేసిన సమయంలో దేశ ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని గుర్తు చేశారు. మన వైద్యులు, నర్సులు, ఫ్రంట్ లైన్ కార్మికులు, శాస్త్రవేత్తలు, ఇతరులు వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కీలకపాత్ర పోషించారని కొనియాడారు.
2021 జనవరి 16న భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. 18 నెలల వ్యవధిలోనే 200 కోట్ల మార్క్ ను చేరుకోవడం మోడీ పటిష్ట నాయకత్వం వల్లే సాధ్యమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫీట్ తో ప్రపంచంలో అత్యంత వేగంగా అత్యధిక వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన దేశంగా చైనా నిలిచింది. ఇప్పటివరకూ అక్కడ 340 కోట్ల డోసులను పూర్తి చేశారు.