ప్రజలనే కాదు ఆర్థికరంగాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఇండియా రెడీ అయ్యింది. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఆమోదించిన కరోనా వ్యాక్సిన్లను శనివారం ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా మొదటి రోజు 3లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. ఇందుకోసం 2934 సెంటర్లను ఏర్పాటు చేయగా… ఇప్పటికే వ్యాక్సిన్లను ఆయా ప్రాంతాలకు చేర్చారు. వర్చువల్ గా ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయనున్నారు.
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్జిన్, సీరం సంస్థ ఉత్పత్తి చేసిన అస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వాడబోతున్నారు. అయితే, ఆరోగ్య కార్యకర్తలకు ఏ వ్యాక్సిన్ తీసుకోవాలన్న ఆప్షన్ ఇవ్వటం లేదు. ఇచ్చింది తీసుకోవాల్సి ఉంటుంది. మూడో దశ ప్రయోగాలు ఇంకా భారత్ బయోటెక్ పూర్తి చేయనుందున… వ్యాక్సిన్ తీసుకునే వారు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండగా, కోవిషీల్డ్ కు మాత్రం ఎలాంటి డిక్లరేషన్ అవసరం లేదు. తొలిదశలో కోటి పదిలక్షల కోవిషీల్డ్ డోసులు, రెండోదశలో 55లక్షల కోవాక్జిన్ డోసులను సేకరించారు.
ఇప్పటికే రిజిస్ట్రర్ అయిన వారికే 28రోజుల్లో రెండు డోసులుగా వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనాను ఎదుర్కొనే సమర్థత వస్తుందని కంపెనీలు ధీమాగా ఉన్నాయి.