-ఒక్క రోజే 796 కొవిడ్ కేసులు
-5000 దాటిన యాక్టివ్ కేసులు
-109 రోజుల తర్వాత ఇదే అత్యధికం
-గత వారంతో పోలిస్తే అధికంగా కేసులు
-మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులో పెరిగిన కేసులు
దేశంలో కరోనా మళ్లీ చాప కింద నీరు లాగా వ్యాపిస్తోంది. దేశంలో శుక్రవారం ఒక్క రోజే 796 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 5000 దాటింది. 109 రోజుల తర్వాత ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం… ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5026 ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 4.46 కోట్లు (4,46,93,506)కు చేరింది. కరోనా బారిన పడి ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,795కి పెరిగింది,
మార్చి 15తో ముగిసిన వారంలో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గత వారం కొవిడ్ కేసుల సంఖ్య 355 గా నమోదైంది. తాజాగా ఈ వారం కేసుల సంఖ్య 668కి పెరిగింది. అటు గుజరాత్ లోనూ 279 కొత్త కేసులతో 1.11శాతం పాజిటివ్ రేటును నివేదించింది.
తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మార్చి 8తో ముగిసిన వారంలో రాష్ట్రంలో 132 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 15తో ముగిసిన వారంలో కేసుల సంఖ్య 267కి పెరిగింది. తమిళనాడులో ఆయా వారాల్లో 170 నుంచి 258కి కరోనా కేసులు పెరిగాయి.