దేశంలో కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. తాజాగా దేశంలో ఒక్క రోజే వేయికి పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కొత్తగా 1,134 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7వేలు దాటింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7026 గా వుంది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,98,118కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు మరణించారు.
ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఒకరు చొప్పున కరోనాకు బలయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,30,813గా వుంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 83 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.83 శాతంగా నమోదైంది.
కొద్ది రోజులుగా ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరగడంతో పాటూ హెచ్3ఎన్2 కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లల్లోని హెచ్3ఎన్2 ఉప రకం వైరస్ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. ఇతర ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల కన్నా హెచ్3ఎన్2 రకం కారణంగా కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వివరించింది.