ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ క్రమంలోనే అల్లర్లు చెలరేగి.. నాయకుల ఇళ్లు, ఆఫీసులను తగులబెడుతున్నారు ప్రజలు. అయితే.. అక్కడ జరుగుతున్న హింసను అరికట్టేందుకు అక్కడి ఆర్మీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కానీ.. అల్లర్లు మాత్రం అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో భారత బలగాలను కొలంబోకు పంపుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. భారత ఆర్మీని అక్కడకు పంపి పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి.
శ్రీలంకకు భారత్ మిలిటరీ బలగాలను పంపుతోందనే కథనాలపై హైకమిషన్ స్పందించింది. ఈ వార్తలను కొట్టిపారేసింది. అవన్నీ వదంతులని ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం అలాంటి ఆలోచనలో లేదని తేల్చి చెప్పింది. శ్రీలంక ప్రజాస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందని.. మళ్లీ ఆర్థిక స్థిరత్వం నెలకొంటుందని ఆశిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసింది.
భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శ్రీలంక సంక్షోభంపై చేసిన వ్యాఖ్యలను భారత హైకమిషన్ గుర్తు చేసింది. కొందరు రాజకీయ వ్యక్తులు, వారి కుటుంబాలు భారతదేశానికి వచ్చారన్న వార్తలపైనా మాట్లాడింది. అవన్నీ తప్పుడు నివేదికలని.. వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిపింది.
ఈ ఊహాజనిత అభిప్రాయలు, నివేదికలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్న హై కమిషన్.. అలాంటి వాటిని భారత ప్రభుత్వం ఆమోదించడం లేదని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది.