కరోనా వైరస్…ప్రపంచాన్నివణికిస్తోన్న కంటికి కనిపించని ఓ సూక్ష్మాతి సూక్ష్మ జీవి… దాని రూపమేదో… ఆకారమేదో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు…ఇప్పటి దాక మనం చూసేవన్నీ ఊహా చిత్రాలు మాత్రమే. కానీ ట్రాన్స్ మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారా కరోనా వైరస్ ఏ విధంగా ఉంటుందో తెలిపే ఫోటోలను ఇండియా మొదటి సారిగా విడుదల చేసింది. పుణె లోని ICMR-NIV సైంటిస్టుల బృందం ఈ ఫోటోలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో పబ్లిష్ చేసింది.
జనవరి 30 ఇండియాలో గుర్తించిన మొదటి కరోనా పాజిటివ్ కేసులో సేకరించిన త్రోట్ శ్వాబ్ (గొంతులో నుంచి సేకరించిన శాంపుల్స్) ద్వారా ఈ వైరస్ ఇమేజెస్ ను తీశారు.జనవరి 30న వుహాన్ లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు కేరళ స్టూడెంట్స్ ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత వారిని పరీక్షించగా కరోనా పాజిటివ్ గా తేలింది. వారి నుంచి సేకరించిన శ్వాబ్ ను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లో పరీక్షించగా వైరస్ జన్యు నమూనా వుహాన్ లోని కరోనా వైరస్ జన్యు నమూనాతో 99.8 శాతం పోలి వుంది.
ఈ ఇమేజ్ ప్రకారం కొవిడ్-19 వైరస్ గతంలోని కరోనా వైరస్ కంటే భిన్నంగా ఉంది. తమ నాలెడ్జ్ ప్రకారం ట్రాన్స్ మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ నుపయోగించి త్రోట్ శ్వాబ్ ద్వారా వైరస్ ఇమేజ్ ను తీయడం ఇండియాలో ఇదే మొదటి సారి అని శాస్త్రవేత్తల బృందం తమ అధ్యయనంలో పేర్కొంది. ”ట్రాన్స్ మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపి ఇమేజింగ్ ఆఫ్ SARS-CoV-2”పేరుతో పబ్లిష్ అయిన ఆ ఆర్టికల్ ను ICMR-NIV నేషనల్ ఇన్ ప్లూయెంజా సెంటర్ టీమ్ పేరున పబ్లిష్ అయ్యింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డిప్యూటీ డైరెక్టర్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, పాథాలజీ హెడ్స్ ఈ ఆర్టికల్ రాశారు.
ఆ ఆర్టికల్ ప్రకారం ఏదైనా ఒక వైరస్ కు సంబంధించిన పార్టికల్స్ ను ప్రిజర్వ్ చేయవచ్చు…కానీ కరోనా వైరస్ లక్షణాలు మాత్రం భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఈ వైరస్ కు కంతుల వంటి నిర్మాణాలు ఉండడమే కారణమై ఉండొచ్చని చెప్పారు. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ క్లాసిఫికేషన్ ప్రకారం వుహాన్ కరోనా వైరసే సార్స్ కరోనా వైరస్-2 గా మారిందని ఆర్టికల్ లో తెలిపారు. దీన్ని అత్యంత వేగంగా వ్యాపించే మానవ న్యూమోనియా వైరస్ గా పేర్కొన్నారు.
ఈ నోవెల్ కరోనా వైరస్ ను ముందుగా నెక్ట్స్ జనరేషన్ సీక్వెనిసింగ్ ద్వారా గుర్తించారు. అయినప్పటికీ దాని అది ఏ జాతి నుంచి వ్యాపించిందనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటి వరకు వైరస్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి అవగాహన కలగలేదు.