ఇండియా- ఉక్రెయిన్ ల మధ్య నడిచే విమానాల సంఖ్యపై ఎయిర్ బబుల్ విధానం కింద ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
‘ ఎయిర్ బబుల్ విధానంలో భారత్-ఉక్రెయిన్ ల మధ్య నడిచే విమానాల సంఖ్యపై ఉన్న పరిమితిని పౌరవిమాన యాన శాఖ ఎత్తి వేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇరు దేశాల మధ్య ఎన్ని విమానాలైనా, చార్డెట్ విమానాలైనా నడుపవచ్చు. ఉక్రెయిన్ లో పరిస్థితుల నేపథ్యంలో విమానాల సంఖ్యను పెంచాలని ఇండియన్ ఎయిర్ లైన్స్ కు తెలియజేశాము” అని పౌరవిమాన యాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులు, కేంద్రం సూచనల నేపథ్యంలో పలువురు భారత పౌరులు స్వదేశానికి తిరిగి రావాలని అనుకుంటున్నారు. దీని కోసం విమాన టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తగిన సంఖ్యలో విమానాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు భారత పౌరులు చెబుతున్నారు.
‘ ఉక్రెయిన్- భారత్ మధ్య తగినన్ని విమానాలు లేకపోవడంపై భారత పౌరుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ విషయానికి చెంది విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ భారత్ రావడానికి వీలైనంత వరకు అందుబాటులో సౌకర్యంగా ఉన్న విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోండి” కైవ్ లోని భారత రాయభార కార్యాలయం ప్రకటన చేసింది.
ప్రస్తుతం ఉన్న అదనపు అవసరాలను తీర్చేందుకు ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియాలతో కలిసి మరిన్ని విమానాలను నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నాము. వీటికి సంబంధించిన వివరాలను భారత రాయభార కార్యాలయం త్వరలో వెల్లడిస్తుందని పౌరవిమానయాన శాఖ పేర్కొంది.