దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఇటీవల కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేసుల సంఖ్య సుమారు 1900 లకు చేరుకుంది. 149 రోజుల తర్వాత ఈ స్థాయిలో కొవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం… 24 గంటల వ్యవధిలో 1890 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 9,433కు చేరుకుంది. కరోనా బారిన పడి మహారాష్ట్ర, గుజరాత్లో ఇద్దరు చొప్పున, కేరళలో మరో ముగ్గురు మరణించారు.
దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 5,30,831కు పెరిగింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతం, వారంలో పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు దాటింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగానే ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. 0.02 శాతం యాక్టివ్ కేసులు ఉంది. కరోనా రికవరీ రేటు 98.79 శాతం గా నమోదైంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,63,883కు చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు 220.65 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు.