ఇండియాలో మళ్ళీ కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. 114 రోజుల తరువాత మొదటిసారిగా ఈ నెల 11 నాటికి ఇవి 500 కి పైగా నమోదయినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 11 రోజుల్లో సగటున ఇవి రెట్టింపయినట్టు పేర్కొంది. అయితే కోవిడ్ సంబంధ మరణాలేవీ పెరగలేదని, ఈ ఏడు రోజుల్లో ఆరుగురు కరోనా రోగులు మృతి చెందారని ఈ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ వారం రోజుల్లో 2,671 కేసులు తాజాగా నమోదయ్యాయి. నాలుగు వారాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఫ్రెష్ కేసులు నమోదు కాగా.. గుజరాత్ లో కనీసం 100 కేసులు బయటపడ్డాయి. గత ఏడు రోజుల్లో ఈ రాష్ట్రంలో నాలుగు ఇన్ఫెక్షన్ కేసులు మాత్రమే ఉండగా ఒక్కసారిగా నాలుగింతలు పెరిగాయి.
మహారాష్ట్రలో 86 శాతం, తమిళనాడులో 67, తెలంగాణాలో 63 శాతం కేసులు రికార్డయినట్టు అధికారులు వివరించారు. రీకవరీ రేటు 98 శాతం పైగా ఉందన్నారు.
యాక్టివ్ కేసులు 3,618 కాగా ..ఇదివరకు మాదిరే టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అన్న ఐదంచెల స్ట్రాటెజీకి ప్రజలు కట్టుబడి ఉండాలని, అప్రమత్తత అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, అవి ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు.