కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పటికే మూడు వేవ్ లలో అనేక ప్రాణాలను బలిగొన్న మహమ్మారి ఇప్పుడు నాలుగో విడత మరోసారి తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతోంది. మరోసారి 8 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
రోజురోజుకీ కరోనా యాక్టివ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయని.. ప్రస్తుతం దేశంలో 48 వేల క్రియాశీలక కరోనా కేసులున్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 8084 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మరో పది మంది మృత్యువాత పడ్డట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,32,30,101 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,24,771 కు పెరిగినట్టు ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2946 కేసులు, కేరళలో 4319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 చొప్పున ఉన్నాయి.
కాగా గత 24 గంటల్లో 4,592 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసులు 0.11 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతానికి చేరింది. ఆదివారం ఒక్కరోజే 11,77,146 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపింణీ చేసినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.