కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 156 దేశాల పౌరులకు ఇచ్చే ఈ-టూరిస్ట్ వీసాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ-వీసాలు ఐదేండ్ల పాటు చెల్లుబాటు అవుతాయని కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు అన్ని దేశాల పౌరులకు ఇచ్చే రెగ్యులర్ వీసాల( పేపర్)ను కూడా పునరుద్ధరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
కరోనా సంక్షోభం నేపథ్యలో 2020 మార్చిలో ఈ వీసాలను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. తాజాగా రెండేండ్ల తర్వాత మళ్లీ వాటిని పునరుద్ధరించారు.
వీటితో పాటు యూఎస్, జపాన్ పౌరుల దీర్ఘకాలిక (పదేళ్ల) రెగ్యులర్ టూరిస్ట్ వీసాలను సైతం పునరుద్ధరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆయా దేశాల పౌరులకు నూతనంగా వీసాలను కూడా జారీచేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.