- ఇండియాలో ఆయుధాల కొరత.. ‘ఆత్మనిర్బర్’ తెచ్చిన అవస్థ
‘మేకిన్ ఇండియా’ పాలసీ మంచిదే కావచ్చు..పరాయిదేశాలమీద ఆధారపడకుండా అన్నీ మనమే తయారు చేసుకుని స్వావలంబన సాధించాలన్న ఆశయం ఉదాత్తమైనదే కావచ్చు. దీన్నే ప్రధాని మోడీ ‘ఆత్మనిర్భర్’ గా ప్రకటించారు. కానీ నాణానికి మరోవైపులా ఈ మేకిన్ ఇండియా లేదా ఆత్మనిర్భర్.. కొన్ని చిక్కులకు కూడా కారణమవుతోంది. దీని కారణంగా భారత సైనిక దళాలకు అవసరమైన ఆయుధాల కొరత ఏర్పడుతోంది. ఆర్మీతో బాటు నేవీ, వైమానిక దళాలు కొన్ని అధునాతన వెపన్స్ ని దిగుమతి చేసుకోలేకపోతున్నాయి. పాత, కాలం చెల్లిన ఆయుధాల స్థానే కొత్తవాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్న ప్రతిపాదనకు బ్రేక్ పడుతోంది. సాయుధ దళాలకు లేటెస్ట్ హెలికాఫ్టర్లు, ఫైటర్ జెట్లు చాలా అవసరం. ఇప్పుడున్నవాటి స్థానే వాటిని మోహరించాల్సి ఉంటుంది.pm modi
ఇదే పరిస్థితి కొనసాగితే 2026 నాటికి ఇండియాలో హెలికాఫ్టర్లు, 2030 నాటికి వందలాది ఫైటర్ జెట్ల కొరత తీవ్రంగా ఉంటుందని సైనికవర్గాలు భయపడుతున్నాయి. భారత్ లోని ఈ పరిస్థితిని గమనిస్తున్న పాకిస్తాన్, చైనా దేశాలు ఏ క్షణమైనా బెదిరింపులకు దిగవచ్చునని ఆందోళన చెందుతున్నాయి. దేశంలో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచేందుకు, విదేశీమారక ద్రవ్యాన్ని తగ్గించేందుకు మొబైల్ ఫోన్ల నుంచి ఫైటర్ జెట్ల వరకు అన్నింటినీ మనమే తయారు చేసుకునేలా ‘మేకిన్ ఇండియా’ పాలసీని మోడీ ఆనాడే ప్రకటించారు. కానీ ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ.. మన సాయుధ దళాలు తమ అవసరాల మేరకు తగినన్ని ఆయుధాలను తయారు చేసుకోలేకపోతున్నాయి. పోనీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు అడ్డు వస్తున్నాయి.
భారత ఆయుధాల తయారీలో 30 నుంచి 60 శాతం వరకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నది మోడీ పాలసీ.. కానీ లోగడ ఈ నిబంధన ఉండేది కాదు. డొమెస్టిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ విధానం సరళతరంగా ఉండేది.. లోకల్ గా కొన్ని రక్షణ పరికరాల కొనుగోళ్లను పెంచుకోవడానికి డిఫెన్స్ శాఖ యత్నిస్తోంది. అయితే డీసెల్-ఎలెక్ట్రిక్ సబ్ మెరైన్లు, రెండు ఇంజన్ల ఫైటర్ల వంటి వాటిని మనం దేశంలోనే తయారు చేసుకోలేకపోతున్నాం.. దేశీయంగా తయారైన సింగిల్ ఇంజన్ ఫైటర్లను ఉపయోగించుకోవాలని మోడీ వైమానిక దళానికి సూచించిన దృష్ట్యా,.. విదేశాలనుంచి ఫైటర్ల దిగుమతికి అడ్డుకట్ట పడింది.
2030 నాటికి భారత వైమానిక దళానికి 30 కన్నా తక్కువే ఫైటర్ల కొరత ఏర్పడుతుందని అంచనా.. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత రక్షణకు ఇవి ఏ మాత్రం సరిపోవు. పైగా పాత హెలికాఫ్టర్ల సామర్థ్యం తగ్గిపోతోంది. 2017 నుంచి మిలిటరీ హెలికాఫ్టర్లు కూలిపోవడం వల్లో, ఇతర ప్రమాదాల వల్లో గత డిసెంబరు వరకు 31 మంది సైనికులు మరణించగా.. మరో 19 మంది గాయపడ్డారు. మరి మేకిన్ ఇండియా పాలసీ ఒక రకంగా భారత సాయుధ దళాలకు ‘ముప్పు’ వంటిదేనని భావిస్తున్నారు నిపుణులు.