వరుసగా నాలుగు భూకంపాలతో తల్లడిల్లిపోయిన టర్కీకి ఇండియా నుంచి సహాయ సామగ్రితో కూడిన తొలి కార్గో విమానం బయల్దేరింది. అత్యవసర మందులు, డ్రిల్లింగ్ మెషీన్లు, దుప్పట్లు తదితర సామగ్రితో బాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఇందులో పంపుతున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి తెలిపారు. మొదటి బ్యాచ్ కి సంబంధించిన విమాన సంబంధ ఫోటోలను, వీడియోలను ఆయన షేర్ చేశారు. రిక్టర్ స్కేలుపై 7.8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపానికి గురైన టర్కీ, సిరియా దేశాలను వెంటనే ఆదుకుంటామని ప్రధాని మోడీ నిన్న ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఎన్డీ ఆర్ఎఫ్ బృందాలను కూడా యుద్ధ ప్రాతిపదికన పంపుతున్నట్టు బాఘ్చి వెల్లడించారు. మానవతా దృక్పథంతో చేయగలిగినంత సాయమంతా చేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం కూడా పేర్కొంది. ప్రకృతి వైపరీత్యానికి గురైనప్రాంతాల్లో బాధితులకు వైద్య సాయం అందించేందుకు ప్రత్యేక తర్ఫీదు పొందిన డాక్టర్లను, పారామెడికోలను సైతం టర్కీకి పంపుతున్నారు.
టర్కీ, సిరియాలలో భూకంప ధాటికి మరణించిన మృతుల సంఖ్య.. దాదాపు 5 వేలమందికి పైగా పెరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వందయేళ్ల తరువాత ఇంత భయానక భూకంపం ముఖ్యంగా టర్కీని వణికించేయడం ఇదే మొదటిసారి. ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు, ఇళ్ళు, ఇతర కట్టడాలతో టర్కీ రాజధాని అంకారాతో సహా అనేక నగరాలు మృత్యు దిబ్బల్లా కనిపిస్తున్నాయి.
శిథిలాల కింద ఇంకా అనేకమంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ వంటి పలు దేశాలు టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు సిద్ధమని ప్రకటించాయి. ఆయా దేశాల నుంచి సహాయ సామగ్రిని యుద్ధప్రాతిపదికన పంపుతున్నారు. సిరియాలోని అలెప్పో, హామా సహా అనేక నగరాల్లో భవనాలు కూలిపోయాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి.