భారత చిరుధాన్యాలను సిరుల పంటగా అభివర్ణిస్తున్నారు. ఈ యేడాదిని ఐక్యరాజ్యసమితి ‘భారత చిరు ధాన్యాల సంవత్సరం’గా ప్రకటించిందంటే ఇండియాలో వీటి పంటలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నదీ తెలుస్తోంది. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ లో చిరుధాన్యాల పంటను ‘అన్నామృతం’ గా పేర్కొన్నారు. శ్రీఅన్న నిధి పథకంలో దీనికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించారు. మొక్కజొన్న, రాగులు, సజ్జలు, అరికెలు,ఊదల వంటి తృణ ధాన్యాలతో ఇండియా సిరుల పంటను పండిస్తున్న దేశంగా పేరు పొందింది.
ఇతర దేశాలకు వీటిని ఎగుమతి చేసేందుకు ఇండియాకు అవకాశం లభించడం వల్లే ఈ యేడాదిని ‘తృణ ధాన్యాల సంవత్సరం’గా ఐరాస ప్రకటించగలిగింది. ఇండియాతో బాటు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యాన్ని అందించే పంటలపై ఆసక్తి పెరిగిందంటే ఇందుకు ఈ చిరు ధాన్యాలే కారణమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్తులో నీటి అవసరాలు పెరుగుతాయని, అలాంటప్పుడు తక్కువ నీటిని ఉపయోగించుకునే పంటలను ప్రోత్సహించాలని వీరు సూచిస్తున్నారు. ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రాగులు వంటి చిరుధాన్యాలను అందిస్తున్నాయి. ప్రధాని మోడీ.. వీటిని ‘శ్రీఅన్న’ అని పేర్కొంటూ.. కర్ణాటకలో ఇవి సిరిధాన్యాలుగా వ్యవహరిస్తున్నారని, అందువల్లే బడ్జెట్ లో శ్రీఅన్న నిధి పథకాన్ని ప్రస్తావించడం జరిగిందని చెప్పారు.
చిరుధాన్యాల విషయంలో హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ కి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థగా పరిగణించి తోడ్పాటు నందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. శ్రీ అన్న పథకంలో దీన్ని చేర్చి మరిన్ని పరిశోధనలు జరిగేలా ప్రోత్సహిస్తామన్నారు.