-3వేలు దాటిన కేసులు
-ఆరు నెలల్లో ఇదే అత్యధికం
-ఢిల్లీలో 300 దాటిన కేసులు
-ఆరోగ్య శాఖ మంత్రి అత్యవసర సమావేశం
కరోనా పడగ విప్పుతోంది. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 3 వేలు దాటింది. రోజు వారి కేసుల్లో 40 శాతం కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం… దేశంలో తాజాగా 3,375 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 13,509కు చేరుకుంది. ఇక రోజు వారి కరోనా మరణాల సంఖ్య పెరగడం కూడా కలవరం రేపుతోంది. కరోనా బారిన పడి దేశంలో 14 మంది మరణించారు.
మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్లో ఒక్కరు, కేరళలో 8 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 5,30,862కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న 300 కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో అధికారులతో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరవ్ భరద్వాజ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. కరోనా కేసుల నేపథ్యంలో అధికారులు, స్పెషలిస్టు వైద్యులతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు.