ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ బుధవారం అన్నారు. ఉక్రెయిన్ లో జరగుతున్న యుద్ధంపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
‘ ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధాన్ని భారత్ ప్రధానంగా వ్యతిరేకిస్తోందన్నారు. రక్త పాతం సృష్టించడం, అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడం ద్వారా ఎలాంటి పరిష్కారాన్ని కనుగొనలేమని భారత్ విశ్వసిస్తోంది’ అని అన్నారు.
ప్రస్తుత సమాజంలో చర్చలు, దౌత్యం అనేవి యుద్ధానికి సరైన సమాధానాలని ఆయన అన్నారు. ఈ యుద్ధం దేశంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందన్నారు. అన్ని దేశాల మాదిరిగా మన దేశం కూడా ఎదురయ్యే చిక్కులను అంచనా వేస్తోందన్నారు.
దేశ ప్రయోజనాలకు ఏదైతే ఉత్తమగా ఉంటుందో దాన్ని తాము అనుసరిస్తున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్ లో బుచ్చా పట్టణంలో జరిగి మారణ కాండను భారత్ వ్యతిరేకిస్తోందన్నారు. అది చాలా తీవ్రమైన అంశమని, దానిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని భారత్ కోరినట్టు ఆయన వెల్లడించారు.