శ్రీలంకతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో టీమిండియా ఇరగదీసింది. బ్యాట్స్ మెన్స్ మంచిగా రాణించి భారీ స్కోర్ చేశారు. లక్ష్యఛేదనలో లంకేయులు మాత్రం తడబడి ఓటమి చవిచూశారు. నిర్ణీత 20 ఓవర్లకు మనోళ్లు 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 199 పరుగులు చేస్తే.. శ్రీలంక టీమ్ మాత్రం 137 రన్సే చేయగలిగింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది రోహిత్ సేన. విండీస్ తో జరిగిన సిరీస్ లో విఫలమైన ఓపెనర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో మాత్రం దంచికొట్టాడు. 56 బంతుల్లో 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ 44 పరుగులు చేయగా.. శ్రేయాస్ అయ్యర్ 28 బంతుల్లో 57 రన్స్ సాధించాడు.
లంక బౌలర్లలో కుమార, షనక తలో వికెట్ తీశారు. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగారు లంక ఓపెనర్లు పతుమ్ నిషాంక, కమిల్ మిశ్రా. వీరిద్దరూ తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. తర్వాత వచ్చిన లియాంగే కూడా 11 పరుగులకే పెవీలియన్ చేరాడు. అసలంక మాత్రం ఒంటరి పోరాటం సాగించాడు.
10వ ఓవర్ లో చండీమాల్ వికెట్ తీసిన జడేజా పుష్ప స్టయిల్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. తగ్గేదేలే అంటూ సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓవైపు వికెట్లు పడుతున్నాయి.. ఇంకోవైపు భారీ స్కోర్.. 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది శ్రీలంక జట్టు. 18వ ఓవర్ లో ఇద్దరు బ్యాట్ ఝులిపించడంతో స్కోర్ బోర్డు ఒక్కసారిగా ముందుకు కదిలింది. అప్పటికి లంక జట్టు 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
19వ ఓవర్ లో బుమ్రా తక్కువ స్కోర్ ఇచ్చాడు. ఇదే ఓవర్ లో అసలంక 50 పరుగులు పూర్తి చేశాడు. 20వ ఓవర్ సమయానికి 6 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే టీమిండియా విజయం ఖాయం అయిపోయింది. మొత్తం 20 ఓవర్లకు 137 పరుగులు మాత్రమే చేసింది లంక జట్టు.