యూపీని కైవసం చేసుకునేందుకు ఏ అవకాశాన్నీ వదలడం లేదు సమాజ్ వాదీ పార్టీ. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అధికార పార్టీ నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి చాలామంది ఎస్పీ గూటికి చేరారు. తాజాగా దేశంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తిగా రికార్డ్ సృష్టించిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ కూడా అఖిలేష్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎస్పీ.
ఎవరీ ధర్మేంద్ర ప్రతాప్ సింగ్..?
భారతదేశంలోని అత్యంత ఎత్తైన వ్యక్తిగా ధర్మేంద్రకు రికార్డ్ ఉంది. ఇతని ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం. ప్రతాప్ గఢ్ జిల్లాలోని నర్హర్ పూర్ కాసియాహి గ్రామానికి చెందిన వ్యక్తి.
దేశంలోనే ఎత్తైన వ్యక్తి అని రికార్డ్ ఉన్నా.. సమాజ్ వాదీ పార్టీలో చేరడంతో ఇతని పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు.
రాజకీయాలలో ఇది అతని అధికారిక అరంగేట్రం. కానీ.. మొదట్నుంచి సమాజ్ వాదీ పార్టీతో అనుబంధం ఉంది. ఎన్నికల ప్రచారంలో ధర్మేంద్ర ఉపయోగపడతాడని ఎస్పీ భావిస్తోంది.
ధర్మేంద్రకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సిస్టర్స్. ఎత్తులో ఎంతో ఫేమస్ అయినా అదే.. తన జీవితంలో ఎన్నో సమస్యలు తెచ్చి పెట్టిందని చెబుతుంటాడు. హైట్ ఎక్కువగా ఉండడంతో ఎవరూ అతనిని పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వలేదు.
జీవనోపాధి కోసం మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు ధర్మేంద్ర. అయితే ఉద్యోగం రాకపోవడంతో తన హైట్ నే ఆదాయంగా మార్చుకున్నాడు. అలా.. గుర్తింపు పొందాడు.