ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ యోచన వల్ల రానున్న పదేండ్లలో దేశంలో రికార్డు స్థాయిలో కొత్త డాక్టర్లు వస్తారని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. వైద్య విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కూడా దీనికి దోహదపడుతుందని ఆయన అన్నారు.
గుజరాత్‌లోని భుజ్ జిల్లాలో కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. దేశంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నా లేదా అందరికీ వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసినా, రాబోయే 10 ఏండ్లలో దేశం రికార్డు స్థాయిలో కొత్త వైద్యులను పొందబోతోందన్నారు.
ప్రజలకు సరసమైన ధరలో మంచి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను భుజ్ ఆస్పత్రి అందుబాటులోకి తీసుకు వస్తుందని ఆయన నొక్కి చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో కేవలం 1,100 సీట్లతో తొమ్మిది వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవన్నారు. నేడు మనకు 6,000 సీట్లతో 36 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు ఉన్నాయన్నారు.
2001లో భూకంపం సృష్టించిన విధ్వంసాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. భుజ్, కచ్ ప్రజలు ఇప్పుడు తమ శ్రమతో ఈ ప్రాంతానికి కొత్త అదృష్టాన్ని తీసుకు వస్తున్నారని అన్నారు. నేడు, ఈ ప్రాంతంలో అనేక ఆధునిక ఆస్పత్రులు ఉన్నాయి. భుజ్ ప్రజలకు ఈరోజు ఆధునిక, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తోందన్నారు.