దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు 100 కు పైగా ఛీతాలు రానున్నాయి. క్రమంగా అంతరించిపోతున్న ఈ జంతువులను ఇక్కడికి రప్పించే విశిష్ట ప్రాజెక్టును ప్రభుత్వం చేబట్టింది. దీనికి సంబంధించి ఇండియాతో తాము డీల్ కుదుర్చుకున్నట్టు ఆఫ్రికా ప్రకటించింది. మొదటి విడతగా వచ్చే నెల 12 ఛీతాలు దేశానికి చేరుకోనున్నాయని పర్యావరణ మంతిత్వ శాఖ తెలిపింది.
నమీబియా నుంచి గత ఏడాది సెప్టెంబరులో 8 ఛీతాలు మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కుకు చేరుకున్నాయి. ప్రధాని మోడీ వీటిలో కొన్నింటిని నాడు ఈ పార్కులో వదిలారు. రానున్న 10 నుంచి 10 ఏళ్లలో సంవత్సరానికి 12 ఛీతాలను ఇండియాకు ట్రాన్స్ లొకేట్ చేయాలన్నది లక్ష్యంగా ఉందని ఈ శాఖ వెల్లడించింది.
ఒకప్పుడు ఇండియాలో ఈ జంతువుల సంఖ్య ఎక్కువే ఉన్నా క్రమేపీ అంతరించిపోతూ వచ్చింది. 1952 నాటికి ఇవి పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగానో, వేటగాళ్ళ బారిన పడో ఇవి ఈ దేశంలో కనిపించకుండా పోయాయి.
వీటిని ఇండియాలో మళ్ళీ ప్రవేశపెట్టేందుకు 2020 లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రయోగాత్మకంగా ఆఫ్రికన్ ఛీతాలను సురక్షితంగా ఇండియాకు తెచ్చే ప్రక్రియను ప్రారంభించాలని ఆనాడు సుప్రీంకోర్టు కూడా సూచించింది. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్ లో ఉన్న 8 జంతువులు ఆరోగ్యంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.