న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు అదరగొడుతున్నారు. కేవలం 10 ఓవర్లకే 82 పరుగులు చేశారు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 39 పరుగులు, గిల్ 41 పరుగులతో అదరగొడుతున్నారు. టీమిండియాకు ఈ ఇద్దరూ చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు.
ఈ ఇద్దరి దూకుడు చూస్తుంటే టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ దక్కించుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి వన్డేలో గట్టి పోటీనిచ్చిన కివీస్.. రెండో మ్యాచ్‌లో పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకుంది.
ఇండోర్ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన టీ20లో రోసో 48 బంతుల్లోనే శతకం బాదేశాడు. అందుకే నేటి మ్యాచ్‌లో భారీ స్కోర్లను ఆశించవచ్చు. అటు కివీస్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడినా.. ఈ ఆఖరి మ్యాచ్‌లోనైనా నెగ్గి టీ20 సిరీస్‌ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించాలనుకుంటోంది. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చే ఏ జట్టయినా నిరాశతో వెనుదిరగాల్సిందే.
ఎందుకంటే ఇక్కడ జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకోవడం టీమిండియాకు మంచినీళ్ల ప్రాయంలా మారింది. 2009 నుంచి సొంత గడ్డపై 27 సిరీస్‌లు ఆడితే 24 నెగ్గడం విశేషం. అంతేనా.. 2019 నుంచి ఇక్కడ వరుసగా ఏడు సిరీస్‌లను వశం చేసుకోగలిగింది. ఇక నేటి మూడో వన్డేలోనూ ప్రత్యర్థికి ఓటమి రుచి చూపిస్తే ఈ ఏడాదే వరుసగా రెండో క్లీన్‌స్వీప్ చేసినట్టవుతుంది.