న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ.. పాడుతూ కొట్టేసింది టీమిండియా. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో కివీస్ పై ఘనవిజయం సాధించింది.
109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 111 పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (51) అర్థ శతకంతో అదరగొట్టగా, గిల్ (40), కొహ్లీ (11), ఇషాన్ కిషన్ (8) పరుగులు చేశారు. అయితే నామమాత్రపు మూడో వన్డే మంగళవారం జరగనుంది.
న్యూజిలాండ్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్ (36) టాప్ స్కోరర్ గా నిలవగా, మైఖేల్ బ్రాస్‌వెల్ (22), మిచెల్ శాంటర్న్ (27), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్, టామ్ లెథమ్ చెరో పరుగు మాత్రమే ఇచ్చారు. కివీస్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంటర్న్ కాసేపు క్రీజులో నిలదొక్కుకోవడంతో కివీస్ 100 పరుగుల మార్కుని దాటింది. భారత్ బౌలర్లలో షమి 3 వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు, సిరాజ్, శార్దూల్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.