గువహటిలోని బర్సపారా స్టేడియం వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో విరాట్ కోహ్లి 87 బంతుల్లో 113 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కోహ్లీ బ్యాట్ చెలరేగిపోవడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. కోహ్లి శతకానికి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు తోడవడంతో టీమిండియా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్నే ఉంచింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు రోహిత్ శర్మ (67 బంతుల్లో 83), శుభ్‌మన్ గిల్ (60 బంతుల్లో 70) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 19.4 ఓవర్లలోనే 143 పరుగులు జోడించారు. గిల్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చిన షనక శ్రీలంకకు బ్రేక్ ఇచ్చాడు.
సెంచరీ చేసేలా కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ మదుషంక ఓవర్లో బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (28)తో కలిసి జట్టు స్కోరును 200 మార్క్ దాటించిన విరాట్ కోహ్లి.. కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 39)తో కలిసి 40 ఓవర్లలోనే 300 పరుగులు దాటించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. విరాట్ కోహ్లి దూకుడుగా ఆడాడు. రెండు తేలికైన క్యాచ్‌ను లంక ఫీల్డర్లు వదులుకోవడం విరాట్‌కు కలిసొచ్చింది. దీంతో వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
47వ ఓవర్ తొలి బంతికే బౌండరీ బాది 99 పరుగులు పూర్తి చేసిన కోహ్లి.. మరుసటి బంతికి సింగిల్ తీసి.. 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లికి వన్డేల్లో ఇది 45వ శతకం కాగా.. వన్డే ఫార్మాట్లో వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ కోహ్లి సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. బర్సపారా స్టేడియంలోనూ కోహ్లికి ఇది వరుసగా మూడో శతకం కావడం గమనార్హం. కోహ్లి కెరీర్లో ఓవరాల్‌గా ఇది 73వ శతకం కావడం విశేషం.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (49) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 45 శతకాలు చేయడానికి 424 ఇన్నింగ్స్ తీసుకోగా.. కోహ్లి 257 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. 2023లో వన్డేల్లో శతకం బాదిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఓ దశలో భారత్ 400 పరుగులు దాటేలా కనిపించింది. కానీ చివరి ఓవర్లలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. 48వ ఓవర్లో అక్షర్ (9) ఔట్ కాగా.. మరుసటి ఓవర్లో కోహ్లి ఔటయ్యాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.