వెస్టీండిస్ తో జరగబోయే ఐదు టీ20 ల సిరీసుకు టీమ్ ఇండియా సభ్యులను ఎంపిక చేశారు. రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించారు.ఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకున్నామని సెలక్టర్లు తెలిపారు. అయితే వారి ఎంపిక ఫిట్‌నెస్‌ను అనుసరించి ఉంటుందని వెల్లడించారు. కాగా సీనియర్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమికి విశ్రాంతినిచ్చారు.
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. యథావిధిగా సంజు శాంసన్‌కు మొండిచేయి చూపించారు.అందరూ అనుకున్నట్లుగానే విరాట్ కోహ్లిని సెలక్టర్లు పక్కన పెట్టేశారు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికా సిరీసులో అతడికి విశ్రాంతినిచ్చారు. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచుకు ఎంపిక చేసినా పరుగులేమీ చేయలేదు.
టీ20 సిరీసులోనూ రాణించలేదు. వన్డేల్లోకి ఎంపిక చేద్దామంటే గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే వెస్టిండీస్‌తో టీ20 సిరీసులో ) విరాట్‌కు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావించారు. ఏదేమైనా ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో అతడు ఉన్నాడని సెలక్టర్లు ధ్రువీకరించారు.
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీసు జులై 29 నుంచి మొదలవుతుంది. ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్ కీట్స్‌లోని వార్నర్ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.
విండీస్ సిరీస్‌కు టీమ్‌ఇండియా జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవి చంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్ దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్‌సింగ్
విండీస్‌తో వన్డే సిరీసుకు గత వారమే టీమ్‌ఇండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్ జట్టును నడిపిస్తాడని సెలక్టర్లు ప్రకటించారు. రవీంద్ర జడేజా అతడికి డిప్యూటీగా ఉంటాడని పేర్కొన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రిషభ్ పంత్, షమి, హార్దిక్ పాండ్యకు రెస్ట్ ఇచ్చారు.