పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా విధానాన్ని ఖండించాలని తమ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా సూచించారని ఆయన అన్నారు. కానీ తాను దాన్ని పాటించలేదన్నారు.
తాను రష్యా పర్యటన నుంచి వచ్చాక ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించాలంటూ ఆర్మీ చీఫ్ తనను కోరాడన్నారు. కానీ ఈ విషయంలో భారత్ వ్యూహాత్మకంగా తటస్థ వైఖరిని అవలంభిస్తోందని చెప్పానన్నార. అందువల్ల పాక్ కూడా అదే తీరులో వ్యవహరించాలని సూచించానన్నారు.
కానీ అమెరికా మెప్పు పొందేందుకు జనరల్ బజ్వా ఓ అడుగు ముందుకేసి ఓ సైనిక సదస్సులో
మాట్లాడుతూ ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ప్రకటన చేశాడని ఆయన విమర్శించారు. తాను ప్రధాని పదవి నుంచి దిగిపోయేలా కుట్ర చేసిన వారిలో బజ్వా కీలక సూత్రధారి అని ఆయన ఆరోపణలు గుప్పించారు.
తాను రష్యా వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యానని చెప్పారు. భారత్ లాగా తమకు కూడా అతి తక్కువ ధరకు చమురు, గోధుమలు సరఫరా చేయాలని కోరానన్నారు. రష్యా మద్దతుతో భారత్ ద్రవ్యోల్బణాన్ని 7.5 నుంచి 5.5 శాతానికి తగ్గించుకుందన్నారు. కానీ పాక్‌లో మాత్రం 12 నుంచి 30 శాతానికి ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు.