దేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు మండుతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో వానలు దంచికోడుతున్నాయి. అయితే, దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. దీంతో ఓ వైపు భానుడి భగ భగలకు ప్రజలు అల్లాడుతోంటే.. మరో వైపు వరుణుడి జోరు మొదలైంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. రోజువారిగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రికార్డు బద్దలు కొడుతున్నాయి. రోడ్డుమీదకు వెళ్లాలంటే మాడు పగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇండ్లలోంచి బయటకు రావాలి అంటేనే జనం భయపడుతున్నారు. ఢిల్లీలో 49 డిగ్రీలకు పైగా టెంపరేచర్ రికార్డవుతోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకురావద్దంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
ఎప్పుడో 1944 మే 29న సఫ్దర్‌జంగ్ వెదర్ స్టేషన్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు దాన్ని మించిపోయింది ఎండల తీవ్రత. ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్‌తో ఢిల్లీలో, చుట్టుపక్కల ప్రాంతాలు హీట్ ఐలాండ్స్‌గా మారాయని అంటోంది నాసా.
ఇక గుజరాత్ సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపై ఉంటున్నాయి. దీంతో రోజూ వందల సంఖ్యలో పిట్టలు డీహైడ్రేషన్‌తో మృత్యువాత పడుతున్నాయి. కొన్ని రోజులుగా వేలాది పక్షులకు ట్రీట్‌మెంట్ చేశామని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు.
ఇక, దక్షిణాదిలో పరిస్థితి పూర్తిగా భిన్నగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రుతు పవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని పేర్కొంది. ఇవి చురుగ్గా కదులుతున్నాయని, అండమాన్ అంతటా విస్తరిస్తున్నాయని వివరించింది.
ఈ ఏడాది నైరుతి నాలుగు రోజులు ముందే వస్తుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని ప్రకటించింది. మరోవైపు, ఈశాన్య రాష్ట్రమైన అసోంను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు వందలకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. పంటలు నాశనమయ్యాయి. కొండ చరియలు, రైల్వే ట్రాక్‌లు, వంతెనలు దెబ్బతినడంతో రవాణా నిలిచిపోయింది. ఇలా.. ఒకచోట ఎండలు.. మరోచోట వానలతో దేశంలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి.